Vallabhaneni Vamsi: ముగిసిన వల్లభనేని వంశీ 3 రోజుల కస్టడీ.. కాసేపట్లో జైలుకి తరలింపు

- కృష్ణలంక పీఎస్ లో వంశీని విచారించిన పోలీసులు
- విచారణ అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు
- వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణను విచారించిన పోలీసులు
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసు కస్టడీ ముగిసింది. వంశీని విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వంశీని పోలీసులు విచారించారు. ఈరోజు విచారణ ముగిసిన అనంతరం వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. కాసేపట్లో ఆయనను జైలుకు తరలించనున్నారు.
వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులు లక్ష్మీపతి, శివరామకృష్ణను పోలీసులు విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ లో ఎవరి ప్రమేయం ఉందనే దానిపై ఆరా తీశారు. వంశీ చెపితేనే సత్యవర్ధన్ ను తీసుకెళ్లామని వారు చెప్పినట్టు సమాచారం. మరోవైపు తనకేమీ తెలియదని విచారణలో వంశీ చెప్పినట్టు తెలిసింది. తన మూడు ఫోన్లు ఎక్కడున్నాయనే దానిపై కూడా తనకు తెలియదని వంశీ చెప్పినట్టు సమాచారం.