Manchu Vishnu: ఆ పాటలో వున్నది నా కూతుళ్లే: మంచు విష్ణు

- శ్రీకాళహస్తిలో కన్నప్ప చిత్ర బృందం
- శ్రీకాళహస్తి మహాత్మ్యం పాట చిత్రీకరణ
- ఈ పాటను మార్చి 19న విడుదల చేస్తామన్న విష్ణు
కన్నప్ప చిత్రంలో శ్రీకాళహస్తి మహాత్మ్యంపై ఆడి పాడింది తన కుమార్తెలేనని హీరో మంచు విష్ణు వెల్లడించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నప్ప చిత్ర బృందం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకుంది. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, ప్రభుదేవా ఆలయానికి చేరుకుని శ్రీ వాయు లింగేశ్వరస్వామి సమేత జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంచు విష్ణు మాట్లాడుతూ కన్నప్ప చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేస్తామని, దీనికి భగవంతుడితో పాటు ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరారు. రెండు రోజుల్లో అంటే మార్చి 1న సినిమా టీజర్ విడుదల అవుతుందని చెప్పారు.
శ్రీకాళహస్తి మహాత్మ్యంపై పాటను రికార్డు చేయడం జరిగిందని, ఈ పాటను సుద్దాల అశోక్ తేజ, రామ జోగయ్య శాస్త్రి ఇద్దరూ రాశారని, దీనికి ఆడి పాడింది తన కుమార్తెలు అర్యనా, దివ్యనలు అని తెలిపారు. చిత్రీకరించిన ఈ పాటను మార్చి 19న తన తండ్రి మోహన్ బాబు పుట్టిన రోజున విడుదల చేస్తామని చెప్పారు.