Jagan: పులివెందులలో రాజారెడ్డి కంటి ఆసుపత్రి ప్రారంభించిన జగన్

- ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ సహకారంతో కంటి ఆసుపత్రి విస్తరణ
- ఆసుపత్రి ప్రారంభించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానన్న జగన్
- ఆసుపత్రిలో కంటి పరీక్షలు చేయించుకున్న జగన్
- జగన్ కు ఎలాంటి కంటి సమస్యలు లేవన్న డాక్టర్
వైసీపీ అధినేత జగన్ నేడు సొంత నియోజవకర్గం పులివెందులలో పర్యటించారు. పులివెందులలో ఎల్వీ ప్రసాద్-వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రి ప్రారంభించిన సందర్భంగా జగన్ కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు కంటి సంబంధ సమస్యలేవీ లేవు డాక్టర్ నిర్ధారించారు.
కాగా, పులివెందులలో ఇప్పటికే సేవలు అందిస్తున్న ఈ కంటి ఆసుపత్రిని మరింత విస్తరించారు. ఈ ఆసుపత్రి విస్తరణకు అవసరమైన స్థలాన్ని వైఎస్ రాజారెడ్డి ఫౌండేషన్ కేటాయించింది. అంతేగాకుండా, రూ.10 కోట్ల నిధులను కూడా సమకూర్చింది. దాంతో ఇక్కడ కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షల యంత్రం, 25 వార్డులను ఏర్పాటు చేశారు. రోజుకు 5 వేల కంటి ఆపరేషన్లు నిర్వహించేలా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేశారు.
కాగా, ఎల్వీ ప్రసాద్-వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభోత్సవంపై జగన్ ట్వీట్ చేశారు. రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ప్రారంభించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ సహకారంతో ఈ ఆసుపత్రిని విస్తరించారని, ఇందులో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయని జగన్ వివరించారు.
ఈ సందర్భంగా తన తండ్రి వైఎస్ స్మృతులు గుర్తుకొస్తున్నాయని, ఆయన కూడా పులివెందుల ఆసుపత్రిలో ప్రముఖ వైద్యుడిగా సేవలు అందించారని జగన్ పేర్కొన్నారు.

