Bengaluru Water Crisis: బెంగళూరు మహానగరంలో నీటికి కటకట... కొత్త బోర్లు వేయడం కుదరదు!

- బెంగళూరులో వరుసగా మూడో ఏడాది నీటి ఎద్దడి
- ఈసారి వేసవి రాకముందే పడిపోయిన భూగర్భ జలాలు
- రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు
భారతదేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరు మహానగరంలో మరోసారి నీటి ఎద్దడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేసవి సమీపిస్తున్న సమయంలో భూగర్భ జలాల మట్టం మరింత పడిపోవడం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది.
గతంలోనూ బెంగళూరులో నీటికి కటకట ఏర్పడినా, ఈసారి వేసవి రాకముందే... నీటి కొరత పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో, బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (బీడబ్ల్యూఎస్ఎస్ బీ) కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో కొత్తగా బోర్లు వేయడంపై నిషేధం విధించింది.
పరిస్థితులను మరింతగా అంచనా వేసి, కొత్త బోర్లు తవ్వడంపై ఏడాది పాడవునా నియంత్రణ చేపడతామని బీడబ్ల్యూఎస్ఎస్ బీ వెల్లడించింది. తమ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఎవరైనా బోర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
భూగర్భ జలాల మట్టం పడిపోవడం బెంగళూరులో ఇది వరుసగా మూడో ఏడాది. బెంగళూరు నీటి ఎద్దడి పరిస్థితులపై అధ్యయనం చేసిన ఐఐఎస్సీ సైంటిస్టులు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు.
కొత్త బోర్లు తవ్వుకుంటామంటూ ఇటీవల లెక్కకు మిక్కిలిగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఐఐఎస్సీ శాస్త్రవేత్తల సిఫారసులను పరిగణనలోకి తీసుకుని వాటర్ బోర్డు నిషేధం నిర్ణయం తీసుకుంది.