Ibrahim Zadran: జాద్రాన్ విధ్వంసక సెంచరీ... ఇంగ్లండ్ పై ఆఫ్ఘనిస్థాన్ భారీ స్కోరు

- ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ ఇంగ్లండ్ × ఆఫ్ఘనిస్థాన్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్
- 146 బంతుల్లో 177 పరుగులు చేసిన ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్
- 50 ఓవర్లలో 7 వికెట్లకు 325 పరుగలు చేసిన ఆఫ్ఘన్ టీమ్
ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బి లో అన్ని జట్లకు సెమీస్ అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో, ఆసియా జట్టు ఆఫ్ఘనిస్థాన్ స్ఫూర్తిదాయక బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. ఇవాళ లాహోర్ లో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 325 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ అద్భుతమైన సెంచరీతో ఆఫ్ఘన్ జట్టుకు భారీ స్కోరు అందించాడు. జాద్రాన్ 146 బంతుల్లో 177 పరుగులు చేశాడు. ఆ డైనమిక్ బ్యాట్స్ మన్ ఇంగ్లండ్ బౌలింగ్ ను చీల్చిచెండాడుతూ 12 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు.
ఓ దశలో ఇంగ్లండ్ స్పీడ్ స్టర్ జోఫ్రా ఆర్చర్ ధాటికి 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్థాన్... ఆ తర్వాత 300కి పైగా పరుగులు సాధించిందంటే అది జాద్రాన్ విధ్వంసక బ్యాటింగ్ పుణ్యమే. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఒమర్జాయ్ (41)ల సహకారంతో జాద్రాన్ ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ ను కదం తొక్కించాడు.
చివర్లో మహ్మద్ నబీ అండతో మరింత చెలరేగాడు. నబీ కూడా దాటిగా ఆడడంతో ఆఫ్ఘన్ స్కోరు 300 మార్కు దాటింది. నబీ 24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 40 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 3, లివింగ్ స్టన్ 2, జేమీ ఒవెర్టన్ 1, అదిల్ రషీద్ 1 వికెట్ తీశారు.
కాగా, ఈ మ్యాచ్ ద్వారా ఇబ్రహీం జాద్రాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. గతంలో 162 పరుగులతో తన పేరిటే ఉన్న రికార్డును జాద్రాన్ (177) తాజా ఇన్నింగ్స్ తో సవరించాడు.