Chhaava: 'ఛావా'ను తెలుగులో రిలీజ్ చేస్తున్న గీతా ఆర్ట్స్... విడుదల తేదీ ప్రకటన!

- విక్కీ కౌశల్, లక్ష్మణ్ ఉటేకర్ కాంబోలో 'ఛావా'
- శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ
- ఈ నెల 14న విడుదలైన సినిమాకు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం
- ప్రేక్షకుల కోరిక మేరకు తెలుగులో విడుదల చేస్తున్న గీతా ఆర్ట్స్
- మార్చి 7న తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, రష్మిక జంటగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం 'ఛావా'. మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ ఈ సినిమాను నిర్మించారు. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ నెల 14న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసులవర్షం కురిపిస్తోంది. 12 రోజుల్లోనే ఏకంగా రూ. 500 కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఇలా బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతున్న ఛావాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఇప్పుడు తెలుగులో విడుదల చేస్తోంది. మార్చి 7న తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. గొప్ప ప్రజాదరణ పొందిన శంభాజీ మహరాజ్ ఇతిహాస గాథ ఇప్పుడు తెలుగులో గర్జించడానికి సిద్ధంగా ఉందని పేర్కొంది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు తెలుగులో విడుదల చేస్తున్నట్లు గీతా ఆర్ట్స్ తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసిన నిర్మాణ సంస్థ విడుదల తేదీని ఖరారు చేసింది.