Shiva Rajkumar: కీమోథెరపీ సమయంలో బలహీనంగా తయారయ్యాను: శివ రాజ్ కుమార్

- క్యాన్సర్ బారిన పడిన కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్
- అమెరికాలో చికిత్స
- ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న వైనం
- మార్చి మొదటి వారం నుంచి మళ్లీ సినిమాలతో బిజీ అవుతానని వెల్లడి
కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ క్యాన్సర్ బారినపడి, ప్రస్తుతం కోలుకుంటున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న స్పోర్ట్స్ ఓరియెంటెడ్ మూవీలో శివన్న ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, క్యాన్సర్ బారినపడినప్పుడు తన అనుభవాల గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
తనకు క్యాన్సర్ ఉన్నట్టు గతేడాది ఏప్రిల్ లో తెలిసిందని వెల్లడించారు. ఆ సమయంలో తన చేతిలో అనేక సినిమాలు ఉన్నాయని... కొన్ని అనారోగ్య లక్షణాలు కనిపించడంతో, రెస్ట్ లేకపోవడం వల్ల అయ్యుంటుందని భావించానని వివరించారు. ఆ లక్షణాలు ఎంతకీ నయం కాకపోవడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నానని, క్యాన్సర్ అని తేలిందని తెలిపారు.
"నాకు క్యాన్సర్ అని తెలియగానే ఎంతో ఆందోళనకు గురయ్యాను. అయితే కుటుంబ సభ్యులు, అభిమానులు, డాక్టర్లు ఇచ్చిన ధైర్యంతో మళ్లీ మామూలు మనిషిని అయ్యాను. కీమోథెరపీ సమయంలో చాలా బలహీనంగా తయారయ్యాను, ఎంతో నీరసంగా అనిపించేది. కీమోథెరపీ తీసుకుంటూనే కొన్ని సినిమాల చిత్రీకరణలో పాల్గొన్నాను.
క్యాన్సర్ ట్రీట్ మెంట్ అనంతరం ఆహార అలవాట్లపై దృష్టి సారించాను. యోగా ఇప్పుడు నా జీవితంలో ఓ భాగమైంది. వచ్చే నెల మొదటి వారం నుంచి మళ్లీ సినిమాలతో బిజీ అవుతాను. తెలుగులో రామ్ చరణ్ చిత్రంలో నటిస్తున్నాను. కొన్ని రోజులు ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటాను. ఈ చిత్రంలో నా రోల్ చూస్తే ఎంతో స్పెషల్ గా ఉంటుంది" అని శివ రాజ్ కుమార్ వివరించారు.
కాగా, క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యాక శివన్న అమెరికా వెళ్లి చికిత్స పొందారు. కొన్ని నెలల పాటు అమెరికాలోనే ఉన్న ఆయన ఇటీవలే బెంగళూరు తిరిగొచ్చారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.