Rajya Sabha: రాజ్యసభకు కేజ్రీవాల్ అంటూ ప్రచారం... స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ

- పంజాబ్‌లో ఉప ఎన్నికల బరిలో నిలిచిన రాజ్యసభ ఎంపీ సంజీవ్ ఆరోడా
- సంజీవ్ స్థానంలో కేజ్రీవాల్ రాజ్యసభకు వెళతారని ప్రచారం
- పార్టీలో అలాంటి చర్చ జరగలేదని ఖండించిన ఆమ్ ఆద్మీ పార్టీ
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ త్వరలో రాజ్యసభకు వెళ్లే అవకాశముందని ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. కేజ్రీవాల్ రాజ్యసభకు వెళతారనేది అవాస్తవమని, అవన్నీ వదంతులేనని కొట్టిపారేసింది.
ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న సంజీవ్ ఆరోడాను ఆ పార్టీ పంజాబ్ ఉప ఎన్నికల బరిలో దింపింది. త్వరలో జరగనున్న లుథియానా వెస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఆమ్ ఆద్మీ పార్టీ సంజీవ్ ఆరోడా పేరును ఖరారు చేస్తూ ప్రకటనను విడుదల చేసింది. సంజీవ్ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆయన స్థానంలో కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.
కేజ్రీవాల్‌ను రాజ్యసభకు పంపించే అంశంపై పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ విభాగం అధికార ప్రతినిధి జగ్తర్ సింగ్ తెలిపారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.