Sunil Gavaskar: పాక్ ఇలాగే ఆడితే ఇండియా-బీ టీమ్‌ను కూడా ఓడించలేదు: గవాస్కర్

- 1996 తర్వాత తొలిసారి ఐసీసీ టోర్నీకి పాక్ ఆతిథ్యం
- చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి వరుస పరాజయాలు
- భారత జట్టుకు గట్టి పోటీ ఇస్తుందని భావించానన్న గవాస్కర్
- పీఎస్ఎల్ లాంటి టోర్నీలు ఉన్నా ఉత్తమ ఆటగాళ్ల కోసం పాక్ ఇబ్బంది పడుతోందన్న మాజీ కెప్టెన్
సొంతగడ్డపై దారుణమైన ఆటతీరుతో చాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలగిన పాకిస్థాన్ జట్టుపై అన్ని వైపుల నుంచి విమర్శల వర్షం కురుస్తోంది. పాక్ మాజీలైతే సొంత ఆటగాళ్లపై దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా, ఈ విమర్శకుల్లో టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా చేరారు.
పాక్ జట్టును చూస్తుంటే భారత బీ జట్టును కూడా ఓడించలేదని అనిపిస్తోందని గవాస్కర్ ఎద్దేవా చేశారు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు టీమిండియాకు గట్టి పోటీ ఇస్తుందని భావించానని, కానీ దాని ఆటతీరు చూస్తుంటే భారత బీ జట్టును గెలవడం కూడా కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), దేశీయ టోర్నీలు ఉన్నప్పటికీ ఉత్తమ ఆటగాళ్ల కోసం పాక్ ఇబ్బంది పడుతోందని పేర్కొన్నారు. ఐపీఎల్‌తో భారత యువ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారని, దీనికితోడు రంజీలు ఆడుతున్నారని వివరించారు. దీనిపై పాకిస్థాన్ విశ్లేషించుకోవాలని ఆయన సూచించారు.
డిఫెండింగ్ చాంపియన్ అయిన పాకిస్థాన్ జట్టు టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై పరాజయం పాలైంది. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పరాభవాన్ని మూటగట్టుకుంది. సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ విజయం సాధించడంతో పాకిస్థాన్ ఆశలు గల్లంతయ్యాయి. ఫలితంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. రిజ్వాన్ జట్టు రేపు బంగ్లాదేశ్‌తో నామమాత్రపు చివరి మ్యాచ్‌లో తలపడుతుంది.
1996 తర్వాత తొలిసారి సొంతగడ్డపై ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిచ్చి, డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగినప్పటికీ, పేలవమైన ఆటతీరుతో పాక్ జట్టు విమర్శలు మూటగట్టుకుంది.