Pawan Kalyan: పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన తిరుపతి, ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లు

- వైసీపీకి ఇవాళ భారీ ఎదురుదెబ్బలు
- జనసేనలోకి వచ్చిన 20 మంది ఒంగోలు కార్పొరేటర్లు
- పెద్ద సంఖ్యలో జనసేనలో చేరిన తిరుపతి కార్పొరేటర్లు
- సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన జనసేనాని పవన్ కల్యాణ్
వైసీపీకి ఇవాళ భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఒంగోలు, తిరుపతి నగరపాలక సంస్థలకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు నేడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఒంగోలుకు చెందిన 20 మంది కార్పొరేటర్లు బాలినేని శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పవన్ చేతుల మీదుగా జనసేన కండువాలు కప్పుకున్నారు. వారికి పవన్ జనసేన పార్టీలోకి సాదర స్వాగతం పలికారు.
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో గతంలో వైసీపీకి 43 మంది సభ్యుల బలం ఉంటే... ఇప్పుడది నాలుగుకి పడిపోయింది. ఇంతకుముందే మేయర్, డిప్యూటీ మేయర్ సహా 19 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరారు. ఇప్పుడు మరో 20 మంది జనసేనలోకి రావడంతో ఒంగోలు కార్పొరేషన్ లో వైసీపీ ఉనికి నామమాత్రంనే ఉంది. ఇవాళ జరిగిన కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ కూడా జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు.
ఇక, తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నేతృత్వంలో తిరుపతి కార్పొరేటర్లు కూడా పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలోకి వచ్చారు. వారికి పవన్ కల్యాణ్ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

