AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య

- నిన్న ఏపీ ఫైబర్ నెట్ లో కీలక పరిణామాలు
- చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా
- ఎండీ పదవి నుంచి దినేశ్ కుమార్ బదిలీ
- తాజాగా కొత్త ఎండీని నియమించిన కూటమి ప్రభుత్వం
ఏపీ ఫైబర్ నెట్ లో నిన్న కీలక పరిణామాలు చోటుచేసుకోవడం తెలిసిందే. ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేయడం, ఫైబర్ నెట్ ఎండీ దినేశ్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం జీఏడీకి బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ఆదిత్యను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ లో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో, కూటమి ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. అదే సమయంలో... ఫైబర్ నెట్ లో చైర్మన్, ఎండీ మధ్య విభేదాల వ్యవహారం కూడా ప్రభుత్వాన్ని అసహనానికి గురిచేసింది.
దీనికి సంబంధించిన నివేదిక సీఎం చంద్రబాబు వద్దకు చేరిన కొద్ది వ్యవధిలోనే ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేయడం, ఎండీ పదవి నుంచి దినేశ్ కుమార్ ను తప్పించడం చకచకా జరిగిపోయాయి.