Zoo Park: హైదరాబాద్ జూపార్క్‌లో పెరగనున్న ధరలు

- ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి కొత్త ధరలు
- జూపార్కు ప్రవేశ రుసుము పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.40గా నిర్ణయం
- కమర్షియల్ మూవీ చిత్రీకరణకు రూ.10 వేలు వసూలు
హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో టిక్కెట్ ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు పార్కులో జరిగిన జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నరింగ్ బాడీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయని నెహ్రూ జూపార్క్ క్యురేటర్ జె.వసంత ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఇకపై జూపార్కు సందర్శనకు ప్రవేశ రుసుము పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.40 చొప్పున వసూలు చేయనున్నారు. ఫొటో కెమెరాకు అనుమతి ఇస్తే రూ.150, వీడియో కెమెరా రూ.2,500, సినిమా చిత్రీకరణ కోసం రూ.10 వేలు ఛార్జీని వసూలు చేయనున్నారు.
జూపార్కులో రైలు ప్రయాణానికి పెద్దలకైతే రూ.80, పిల్లలకైతే రూ.40గా నిర్ణయించారు. బ్యాటరీ ఆపరేటెడ్ వాహనం ఎక్కితే పెద్దలకు రూ.120, పిల్లలకు రూ.70 చొప్పున నిర్ణయించారు. సఫారీ పార్కు డ్రైవ్ సీఎన్జీ బస్సు 20 నిమిషాలకు ఏసీ అయితే రూ.150, నాన్-ఏసీ అయితే రూ.100 చొప్పున వసూలు చేయనున్నారు. 11 సీట్లు కలిగిన కొత్త బ్యాటరీ ఆపరేటెడ్ వాహనం 60 నిమిషాలకు రూ.3,300, 14 సీట్ల బీవోవీ ఎక్స్‌క్లూజివ్ వాహనం అయితే రూ.4,000 వసూలు చేయనున్నారు.
వాహనాల పార్కింగ్ విషయానికి వస్తే సైకిల్‌కు రూ.10, ద్విచక్ర వాహనం రూ.30, ఆటో రూ.80, కారు లేదా జీపు అయితే రూ.100, టెంపో లేదా తూఫాన్ అయితే రూ.150, 21 సీట్లు కలిగిన మినీ బస్సు రూ.200, 21 సీట్లు కలిగిన బస్సుకు రూ.300 చొప్పున ధరను నిర్ణయించారు.