Uttam Kumar Reddy: ఎస్ఎల్‌బీసీ దేశంలోనే అత్యంత క్లిష్టమైన సొరంగం: సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Minister Uttam Kumar Reddy on SLBC operation

  • సొరంగంలో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్న మంత్రి
  • ప్రభుత్వం పరంగా చేయాల్సినదంతా చేస్తున్నామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రమాదాలపై రాజకీయాలు చేయలేదన్న మంత్రి

దేశంలోనే ఎస్ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన సొరంగమని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సొరంగంలో చిక్కుకుపోయిన వారి ప్రాణాలను కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని ఆయన అన్నారు. ఎస్ఎల్‌బీసీ వద్ద జరుగుతున్న సహాయక చర్యలపై ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పరంగా చేయాల్సిందంతా చేస్తున్నామని అన్నారు.

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రేపు మరికొందరు నిపుణులు రానున్నారని తెలిపారు. ఎన్జీఆర్ఐ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిపుణులు వస్తున్నట్లు చెప్పారు. ఆర్మీ, నేవీ, జీఎస్ఐ, ఎన్డీఆర్ఎఫ్ సంస్థలకు చెందిన నిపుణులు ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు.

ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఎల్ అండ్ టీ, నవయుగ తదితర సంస్థల నిపుణులు కూడా పనిచేస్తున్నారని వెల్లడించారు. ఈ సంస్థలకు చెందిన నిపుణులు అరవింద్ కుమార్ నేతృత్వంలో పనిచేస్తున్నారని వెల్లడించారు. సొరంగంలో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంటకోసారి ఫోన్ చేసి, వివరాలు తెలుసుకుంటున్నారని తెలిపారు.

బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రమాదాలపై మేం రాజకీయాలు చేయలేదు

ఎస్ఎల్‌బీసీ సహాయక చర్యలపై వస్తోన్న విమర్శలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుబట్టారు. సీనియర్ మంత్రులం ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. సహాయక చర్యలపై విమర్శలు సరికాదని అన్నారు. తమను విమర్శించే వారు వారి హయాంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో పేలుడు జరిగి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. కాళేశ్వరం సొరంగ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రమాదాలపై తాము రాజకీయాలు చేయలేదని అన్నారు.

  • Loading...

More Telugu News