KTR: కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలి: కేటీఆర్ సవాల్

- రేవంత్ రెడ్డిని తరిమి కొడతామని లగచర్ల రైతులు అంటున్నారన్న కేటీఆర్
- కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉందనుకుంటే కడియం శ్రీహరి రాజీనామా చేయాలన్న కేటీఆర్
- పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని జోస్యం
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో స్టేషన్ ఘనపూర్‌కు చెందిన మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఇటీవల తాను లగచర్లకు వెళ్లానని, వేలాది మంది రైతులు తరలివచ్చారని, రేవంత్ రెడ్డిని తరిమి కొడతామని వారు అంటున్నారని పేర్కొన్నారు. సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనే రేవంత్ రెడ్డికి దిక్కు లేదు, ఇక కడియం శ్రీహరిని ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. నిత్యం నీతులు మాట్లాడే కడియం శ్రీహరికి దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉందని ఆయన భావిస్తే రాజీనామా చేయాలని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని, పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయామని ప్రజలకు కూడా అర్థమైందని ఆయన అన్నారు. అయినా గాడిదను చూస్తేనే గుర్రం విలువ, చీకటిని చూస్తేనే వెలుతురు విలువ తెలుస్తుందని ఆయన అన్నారు. అలాగే రేవంత్ రెడ్డిని చూశాక కేసీఆర్ అంటే ఏమిటో అర్థమవుతోందని అన్నారు. తెలంగాణలో దోచుకొని ఢిల్లీలో కప్పం కడుతున్నాడని ఆరోపించారు.
కొడంగల్‌లోని లగచర్లలో లంబాడ సోదరుల భూములు లాక్కునే ప్రయత్నం చేశారని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. స్థానిక రైతులు అధికారుల వద్ద నిరసన తెలపడంతో, రేవంత్ రెడ్డి అహం దెబ్బతిని 40 మందిని జైల్లో పెట్టారని ఆయన అన్నారు. తాము న్యాయపోరాటం చేసి రైతులను జైళ్ల నుండి విడిపించామని వెల్లడించారు.