Hair loss: ఆ గోధుమలతోనే బట్టతల సమస్య!

sudden hair loss cases maharashtra solved

  • జుట్టు ఒత్తుగా ఉండాలని కోరుకోని వారెవరు?
  • కానీ కారణం లేకుండానే జుట్టు ఊడిపోతూ ఆందోళనకు గురైనవారి కథే ఇది
  • అలా జుట్టు రాలిపోవడానికి కారణం గోధుమలేనని తేల్చిన అధ్యయనం

జుట్టు ఒత్తుగా ఉండాలని కోరుకోనివారెవరూ ఉండరు. కానీ ఎలాంటి కారణం లేకుండా ఉన్నట్టుండి జుట్టు రాలిపోతే...? దానికి మనం రోజూ తినే సాధారణ ఆహారమే కారణమమైతే? చాలా చిత్రమైన సమస్య కదా...! మహారాష్ట్రలో ఇటీవల ఇదే సమస్య తలెత్తింది. ఆ సమస్యకు గోధుమలు కారణమని తాజాగా తేలింది. ఆ విశేషాలు ఏమిటంటే...

చిన్నా, పెద్దా అందరికీ సమస్య..
అది మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా. ఆ జిల్లాలో గత ఏడాది డిసెంబర్ లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. దానికి కారణం... ఆడా, మగా, పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ జుట్టు ఊడిపోతూ... బట్టతలలా మారిపోతుండటమే. సమస్య ఏమిటో అర్థంకాక, పీక్కోవడానికి జుట్టూ లేక చాలా మంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 

ఈ జిల్లాలోని సుమారు 18 గ్రామాల్లోని 279 మందిలో అకస్మాత్తుగా వెంట్రుకలు రాలిపోయే ‘ఆక్యూట్ ఆన్ సెట్ అలోపేసియా టోటాలిస్’ సమస్య వచ్చింది. ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంతో పరిశోధకులు దీనిపై దృష్టి సారించారు. జుట్టు ఎందుకు రాలిపోతోందన్న దానిపై అధ్యయనం చేసి... అసలు సంగతి తేల్చారు.

సెలీనియం ఎక్కువున్న గోధుమలే..
బుల్దానా జిల్లాలో అకస్మాత్తుగా జుట్టు రాలడం సమస్యకు కారణం సెలీనియం ఎక్కువగా ఉన్న గోధుమలేనని వైద్య నిపుణులు తేల్చారు. పంజాబ్, హర్యానాలలోని కొన్ని ప్రాంతాల్లో పండిన గోధుమలలో అధిక సెలీనియం ఉండటం, ఆ గోధుమలను విరివిగా వినియోగించడమే దీనికి కారణమని గుర్తించారు. బాధితుల తల వెంట్రుకలు, రక్త నమూనాలను సేకరించి ఈ అధ్యయనం చేశారు.

ఏమిటీ సెలీనియం?
సెలీనియం అనేది ఖనిజ పదార్థం. ఇది సహజంగా నీటితో పాటు కొన్ని ఆహార పదార్థాల్లో లభిస్తుంది. నిజానికి మన శరీరంలో కొన్ని రకాల జీవక్రియలకు సెలీనియం అత్యంత అవసరం. కానీ మోతాదుకు మించితే మాత్రం సమస్యలకు దారితీస్తుంది. అందులో ఒకటి... జుట్టు రాలిపోయే సమస్య. అంతేకాదు సెలీనియం మోతాదు ఎక్కువైతే తలనొప్పి, జ్వరం, దురద, వాంతులు, విరేచనాల వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. మహారాష్ట్రలో బాధితులలో కూడా ఈ లక్షణాలు కనిపించడం గమనార్హం.

గోధుమలు మార్చేస్తే సమస్య తగ్గి... 
బాధితులు తిన్న గోధుమల్లో సాధారణం కంటే 600 రెట్లు ఎక్కువగా సెలీనియం ఉన్నట్టు గుర్తించామని వైద్య నిపుణులు తెలిపారు. దీనితో బాధితులకు ఈ తరహా గోధుమలను వినియోగించవద్దని సూచించామని... దానితో చాలా మందిలో జుట్టు రాలే సమస్య తగ్గిపోయిందని వివరించారు.

Hair loss
Health
Maharashtra
india
offbeat
Viral News
  • Loading...

More Telugu News