Arun Vijay: పెట్టింది 30 కోట్లు... వచ్చింది 13 కోట్లు!

- బాల దర్శకత్వంలో రూపొందిన 'వనంగాన్'
- బధిరుడి పాత్రను పోషించిన అరుణ్ విజయ్
- రివేంజ్ డ్రామా నేపథ్యంలో నడిచే కథ
- నష్టాల బారిన పడిన సినిమా
తమిళ దర్శకులలో 'బాల' స్థానం ప్రత్యేకం. మొదటి నుంచి కూడా ఆయన ఎంచుకునే కథలు కొత్తగా ఉంటాయి. ఆయన కథల్లోని నాయకులు కూడా డిఫరెంట్ గా ఉంటారు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందనగానే ఒక వర్గం ప్రేక్షకులు చాలా ఆసక్తిని కనబరుస్తుంటారు. అలాంటి ఆయన నుంచి వచ్చిన సినిమానే 'వనంగాన్'. అరుణ్ విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా, జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రిధా, రోషిణి ప్రకాశ్, సముద్రఖని కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. బీ స్టూడియోస్ - వీ హౌస్ బ్యానర్లలో ఈ సినిమాను నిర్మించారు. 30 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా, కేవలం 13 కోట్లను మాత్రమే వసూలు చేయగలిగింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 21వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లోకి అడుగుపెట్టింది.
ఈ సినిమాలో అరుణ్ విజయ్ బధిరుడిగా కనిపిస్తాడు. అతనికి మాటలు రావు... వినికిడి శక్తి లేదు. చూపులేని ఒక యువతి జీవితాన్ని కొంతమంది పాడు చేస్తారు. ఆ బధిరుడు వారిపై ఎలా పగతీర్చుకున్నాడు? అనేది కథ. అయితే ఆశించినస్థాయిలో ఆడియన్స్ కి ఈ సినిమా రీచ్ కాలేకపోయింది. బాల మార్క్ కి దగ్గరగా ఈ సినిమా లేకపోవడమే అందుకు కారణమనే టాక్ ఉంది.