Nora Fatehi: 'భాగమతి' డైరెక్టర్ ప్రయోగమే 'ఉఫ్'... సింగిల్ డైలాగ్ లేని సినిమా!

- తెలుగులో దర్శకుడిగా రెండు హిట్లు కొట్టిన అశోక్
- ఈసారి ప్రయోగం చేస్తున్న డైరెక్టర్
- షూటింగు పూర్తిచేసుకున్న 'ఉఫ్'
- త్వరలో రిలీజ్ కానున్న సినిమా
సినిమా అంటే మంచి మాటలు ఉండాలి... మధురమైన పాటలు ఉండాలి. ఆ రెండూ లేని సినిమాలను ఊహించుకోవడానికి కూడా ఆడియన్స్ ఆలోచిస్తారు. అయితే నిజంగానే ఒక్క డైలాగ్ కూడా లేని ఒక సినిమా, త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఒక ప్రయోగంగా రూపొందిన ఆ సినిమా పేరే 'ఉఫ్.
చాలా కాలం క్రితం సింగీతం శ్రీనివాసరావు, సంభాషణలు లేకుండా 'పుష్పక విమానం' తెరకెక్కించారు. కమల్ హాసన్ కెరియర్లోనే అది ఒక చెప్పుకోదగిన సినిమా. అలాగే ఇప్పుడు 'ఉఫ్' అనే సినిమా ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది. హారర్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి, జి. అశోక్ దర్శకత్వం వహించాడు.
అశోక్ కెరియర్లో 'పిల్ల జమీందార్'... 'భాగమతి' వంటి హిట్స్ ఉన్నాయి. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉఫ్'... త్వరలో థియేటర్లకు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నోరా ఫతేహి, నుష్రత్ బరుచా, సోనమ్ షా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, నేరుగా ఓటీటీ ద్వారానే పలకరించనుండటం విశేషం.