Daggubati Purandeswari: అటెండెన్స్ వేయించుకోవడానికి అసెంబ్లీకి వెళ్లడం సిగ్గుచేటు: జగన్ పై పురందేశ్వరి ఫైర్

- ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందనే జగన్ అసెంబ్లీకి వెళ్లారన్న పురందేశ్వరి
- నిర్దిష్ట సంఖ్య ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని వెల్లడి
- వైసీపీ హయాంలో గౌరవ సభను కౌరవ సభగా మార్చారని మండిపాటు
వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీకి వచ్చి వెంటనే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి స్పందిస్తూ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందనే... జగన్ నిన్న అసెంబ్లీకి వెళ్లి అటెండెన్స్ వేయించుకున్నారని ఎద్దేవా చేశారు.
జగన్ అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై మాట్లాడాలని పురందేశ్వరి చెప్పారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా... హాజరు కోసం అసెంబ్లీకి వెళ్లారని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతలను మర్చిపోరాదని అన్నారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. నిర్దిష్టమైన సంఖ్య ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని చెప్పారు. వైసీపీ హయాంలో గౌరవ సభను కౌరవ సభగా మార్చారని దుయ్యబట్టారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగానే కేంద్ర బడ్జెట్ ను రూపొందించారని పురందేశ్వరి చెప్పారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ నేతలు అవమానించారని విమర్శించారు. యువత, మహిళలు, రైతులకు బడ్జెట్ లో ప్రాధాన్యతను ఇచ్చారని తెలిపారు. మహిళలు డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేసే కార్యక్రమానికి బడ్జెట్ లో ప్రాధాన్యతను కల్పించారని చెప్పారు.
రాబోయే ఐదేళ్లలో దేశంలో పేదలకు 3 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని పురందేశ్వరి తెలిపారు. రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి నూతన భవనాలను ప్రారంభించి... శస్త్ర చికిత్సలు జరిగేలా కృషి చేస్తామని చెప్పారు. తిరుపతి, రాజమండ్రి, విశాఖ, నెల్లూరు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర కృషి చేస్తోందని తెలిపారు.