Ayyanna Patrudu: అసెంబ్లీలో జగన్, వైసీపీ సభ్యుల తీరు ప్రజలు అసహ్యించుకునేలా ఉంది: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

- గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు దారుణంగా ప్రవర్తించారన్న స్పీకర్
- జగన్ నవ్వుతూ ఉన్నారని మండిపాటు
- జగన్ కు బొత్స కూడా సర్ది చెప్పలేదని విమర్శ
నిన్న అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు ప్రజలు అసహ్యించుకునేలా ఉందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఈరోజు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత స్పీకర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభులు స్పీకర్ పోడియంలోకి వచ్చి, పేపర్లు చింపి విసిరారని మండిపడ్డారు.
వైసీపీ సభ్యులు దారుణంగా ప్రవర్తిస్తుంటే జగన్ నవ్వుతూ చూశారని, వారిని కంట్రోల్ చేయకపోగా, వారిని మరింత ప్రోత్సహించారని దుయ్యబట్టారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి తమ పార్టీ సభ్యులతో అలా చేయించడం సరికాదని చెప్పారు. జగన్ పక్కనే ఉన్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా జగన్ కు ఇది తప్పని చెప్పలేదని విమర్శించారు. అసెంబ్లీకి అతిథిగా వచ్చిన గవర్నర్ ను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పీకర్ చెప్పారు.