Crime News: పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తల్లి, గాళ్‌ఫ్రెండ్ సహా ఆరుగురిని చంపేశానని తాపీగా చెప్పిన యువకుడు.. పోలీసుల షాక్

- కేరళలోని తిరువనంతపురంలో ఘటన
- నిన్న సాయంత్రం కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడి కిరాతకం
- హత్యకు గురైన వారిలో 13 ఏళ్ల సోదరుడు కూడా
- తాను కూడా విషం తీసుకున్నానని చెప్పడంతో ఆసుపత్రికి తరలించిన పోలీసులు
పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ యువకుడు.. తల్లి, ప్రియురాలు సహా ఆరుగురిని చంపేశానని నింపాదిగా చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. ఆపై నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిందీ ఘటన. నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు నడుచుకుంటూ వచ్చిన 23 ఏళ్ల అఫాన్ కొన్ని గంటల వ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న తన తల్లి, తమ్ముడు, గాళ్‌ఫ్రెండ్ సహా ఆరుగురిని చంపేశానని చెప్పి పోలీసులకు లొంగిపోయాడు. ఆ వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు హత్యకు గురైనట్టు నిర్ధారించారు. మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సోమవారం సాయంత్రం కొన్ని గంటల వ్యవధిలో ఇవి జరిగినట్టు గుర్తించారు. హత్యకు గురైన వారిలో అతడి 13 ఏళ్ల సోదరుడు, నానమ్మ సల్మాబీవీ, పెదనాన్న లతీఫ్, పెద్దమ్మ షాహిహా, ప్రియురాలు ఫర్షానా ఉన్నారు. తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో నిందితుడి తల్లి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. తాను కూడా విషం తీసుకున్నానని చెప్పడంతో నిందితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. హత్యలకు గల కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.