Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ చచ్చిపోయింది!... భగ్గుమంటున్న మాజీలు

- ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్
- వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓటమి
- తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ క్రికెటర్లు
ఛాంపియన్స్ ట్రోఫీలో నిన్న టీమిండియా చేతిలో ఓటమి అనంతరం పాకిస్థాన్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్ లోనే పాక్... న్యూజిలాండ్ చేతిలో పరాజయంపాలైంది. ముఖ్యంగా, చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో నిన్న ఎదురైన ఓటమితో పాక్ మాజీ క్రికెటర్లు, ఆ దేశ క్రికెట్ విశ్లేషకులు భగ్గుమంటున్నారు. పాక్ క్రికెట్ చచ్చిపోయింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
పాకిస్థాన్ మాజీ ఓపెనర్ అహ్మద్ షెజాద్ స్పందిస్తూ... ఒకప్పుడు దేశానికి గర్వకారణంలా నిలిచిన క్రికెట్ క్రీడ... ఇప్పుడు పాకిస్థాన్లో కడతేరిపోయిందని వ్యాఖ్యానించాడు. జట్టు ఆటతీరు, సెలక్షన్ ప్రక్రియ, తమకు కావాల్సిన వాళ్ళకు పెద్దపీట వేయడం వంటి అంశాలపై షేజాద్ విమర్శలు గుప్పించాడు.
"పాకిస్థాన్ జట్టును ఎలా ఎంపిక చేస్తున్నారో మనందరికీ తెలుసు. పాక్ క్రికెట్లో ఏం జరుగుతోందో మనం బయటి ప్రపంచానికి చెప్పకపోతే, అంతా సవ్యంగానే జరుగుతోందని భావిస్తారు. తమకు ఇష్టమైన వాళ్లనే జట్టుకు ఎంపిక చేసే వ్యవస్థ పాక్ లో లేదని ప్రజలు అనుకుంటున్నారు... కానీ అది తప్పు. పాక్ క్రికెట్లో తమకు ఇష్టమైన వాళ్లనే జట్టుకు ఎంపిక చేస్తున్నారు... ఇది నిజం. ఇప్పటిదాకా పాకిస్థాన్ లో ఒకే ఒక్క క్రీడ మిగిలుందని అనుకునేవాళ్లం. ఇప్పుడది కూడా చచ్చిపోయింది" అంటూ షేజాద్ ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు.
మాజీ లెఫ్టార్మ్ పేస్ మహ్మద్ ఆమిర్ స్పందిస్తూ... పీఎస్ఎల్ లో ఆడిన వాళ్లకు కాకుండా, దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరిచే ఆటగాళ్లకు జాతీయ జట్టులో స్థానం కల్పించాలని పాక్ క్రికెట్ బోర్డుకు హితవు పలికాడు.
ఇక, పాక్ క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానిస్తూ... ఇలా జరుగుతుందని తనకు తెలుసని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోవడంపై అఫ్రిది పైవిధంగా స్పందించాడు. 80, 90వ దశకం నాటి మైండ్ సెట్ తో 2025లో ఆడితే ఇలాంటి ఫలితాలే వస్తాయని అన్నాడు.
ఏ పరిస్థితుల్లో ఎలాంటి జట్టును బరిలో దింపాలో ఇప్పటికీ పాక్ క్రికెట్ పెద్దలకు తెలియడంలేదని విమర్శించాడు. 2017 తర్వాత ఐసీసీ ఈవెంట్లలో పాక్ గురించి చెప్పుకోవడానికేమీ లేదని పేర్కొన్నాడు. పెద్ద జట్లతో ఆడేటప్పుడు అటాకింగ్ దృక్పథానికి ప్రాధాన్యత ఇవ్వాలని అఫ్రిది అభిప్రాయపడ్డాడు.