IMD: తెలంగాణలో ఉష్ణోగ్రతలు, ఉక్కపోతపై హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ఏమన్నారంటే...?

IMD on high Telangana temparature

  • ఆగ్నేయం, ఈశాన్యం వైపు నుండి గాలులు వస్తే తేమ ప్రవేశిస్తుందన్న వాతావరణ శాఖ అధికారి
  • తేమ వల్ల ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు అదనంగా ఉన్నట్లు అనుభూతి కలుగుతుందని వెల్లడి
  • గత వారం కంటే ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతున్నాయన్న శ్రీనివాసరావు

ఉత్తర దిక్కుతో పాటు ఆగ్నేయం, ఈశాన్య వైపు నుండి కూడా గాలులు వస్తే వాటితో పాటు తేమ కూడా ప్రవేశిస్తుందని, ఈ కారణంగానే మనకు ఉక్కపోత ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. అప్పుడే వేసవి కాలం వచ్చినట్లుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉక్కపోత కూడా పెరిగింది. 

ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి మాట్లాడుతూ, తేమ ప్రవేశించినప్పుడు సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు డిగ్రీలు అధికంగా ఉన్నట్లు అనుభూతి కలుగుతుందని తెలిపారు. అలాగే ఇది చలికాలం నుండి వేసవి కాలంలోకి అడుగిడుతున్న కాలమని, తక్కువ ఉష్ణోగ్రతకు అలవాటు పడిన మన శరీరానికి ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగినా ఎక్కువగా పెరిగినట్లు అనుభూతి పొందుతామని అన్నారు. 

గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయని తెలిపారు. అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు గత వారం కంటే తక్కువగానే నమోదయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33 నుండి 37 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 నుండి 22 డిగ్రీల వరకు నమోదవుతున్నట్లు తెలిపారు.

ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో అత్యధికంగా సుమారు 36 డిగ్రీల వరకు నమోదైందని, మిగిలిన జిల్లాల్లో 32 డిగ్రీలకు కాస్త అటు ఇటు నమోదైందని తెలిపారు. రానున్న రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా తక్కువగా నమోదయ్యే అవకాశముందని తెలిపారు. గాలిలో అనిశ్చితి వల్ల ఉష్ణోగ్రతలు నెమ్మదించాయని తెలిపారు. ఫిబ్రవరితో పాటు మార్చి నెల కూడా మార్పు కాలమేనని (చలికాలం నుండి వేసవి కాలం) తెలిపారు. నాలుగైదేళ్లుగా ఫిబ్రవరిలోనే మార్పు కాలం కనిపిస్తోందని అన్నారు.

IMD
Telangana
Hyderabad
  • Loading...

More Telugu News