Shashi Tharoor: నా సేవలు కాంగ్రెస్ వద్దనుకుంటే నాకు చాలా వ్యాపకాలు ఉన్నాయి: శశిథరూర్

- కేరళలో వామపక్ష ప్రభుత్వంపై శశిథరూర్ ప్రశంసలు
- పార్టీ వద్దనుకుంటే తనకు సొంత పనులు ఉన్నాయన్న శశిథరూర్
- తన ప్రసంగం కోసం ప్రపంచ దేశాల నుండి ఆహ్వానాలు అందుతున్నాయన్న శశిథరూర్
పార్టీకి తన సేవలు అవసరం లేదని భావించేట్టయితే, తనకు ఇతర వ్యాపకాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. కేరళలో ప్రతిపక్ష వామపక్ష ప్రభుత్వంపై ఆయన ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో పార్టీ తనను వద్దనుకుంటే తనకు ఇబ్బందేమీ లేదని కూడా అధిష్ఠానానికి సందేశం పంపించారు.
శశిథరూర్ అంతకుముందు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కావడంపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల, ఆయన కేరళ కాంగ్రెస్ పార్టీపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళలో కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేడని ఓ ఇంటర్వ్యూలో విమర్శించారు. ఈ ఇంటర్వ్యూ బుధవారం ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన టీజర్ బయటకు వచ్చింది.
శశిథరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అసహనంతో ఉంది. శశిథరూర్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. కేరళ అభివృద్ధి గురించి అభిప్రాయాలు తెలియజేసే హక్కు తనకు ఉందని ఆయన అన్నారు. "పార్టీ నేను కావాలని కోరుకుంటే పార్టీ కోసం పని చేస్తాను, నేను వద్దు అని పార్టీ అనుకుంటే... చేసుకోవడానికి నాకు సొంత పనులు చాలా ఉన్నాయి" అని పేర్కొన్నారు.
కాలం గడవడానికి తనకు ఎలాంటి వ్యాపకాలు లేవని అనుకోవద్దని వ్యాఖ్యానించారు. పుస్తకాలు, ప్రసంగాలు... ఇలా ఎన్నో ఉన్నాయని తెలిపారు. తన ప్రసంగం కోసం ప్రపంచ దేశాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని అన్నారు.