YS Avinash Reddy: కూటమి ప్రభుత్వానికి వైఎస్ అవినాశ్ రెడ్డి సవాల్

- పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందంటున్న కూటమి నేతలు
- కుప్పం, పిఠాపురం, మంగళగిరిలో ఎన్నికలకు సిద్ధమా? అని అవినాశ్ సవాల్
- వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్
జగన్ పై అనర్హత వేటు పడుతుందని, పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి స్పందిస్తూ... సూపర్ సిక్స్ రెఫరెండంతో కుప్పం, పిఠాపురం, మంగళగిరి నియోజకవర్గాల్లో ఎన్నికలకు మీరు సిద్ధమా? అని కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమయిందని... ప్రభుత్వంపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని చెప్పారు. కడపలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో తాము సంధించే ప్రశ్నలకు భయపడే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అవినాశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నది ఒకే ప్రతిపక్షమని... 11 సీట్లు ముఖ్యం కాదని అన్నారు. అసెంబ్లీలో ఉన్న నాలుగు పార్టీల్లో మూడు ప్రభుత్వంలో ఉన్నాయని... మిగిలిన ఏకైక పార్టీ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు.