Manchu Vishnu: కుటుంబ గొడవలపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

- కుటుంబంలోని గొడవలకు ఫుల్ స్టాప్ పడితే బాగుంటుందన్న విష్ణు
- తనకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమని వ్యాఖ్య
- ఎన్ని జన్మలకైనా మోహన్ బాబే తన తండ్రిగా ఉండాలని ఆకాంక్ష
సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ గొడవలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. పరిస్థితి పోలీసు కేసుల వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు మాట్లాడుతూ... తనకు ఉమ్మడి కుటుంబం అంటేనే ఇష్టమని, అమ్మానాన్నలతో కలిసి ఉండాలానుకుంటానని చెప్పాడు. తన పిల్లలు కూడా అలాంటి వాతావరణంలోనే పెరగాలని కోరుకుంటానని తెలిపాడు. తమ కుటుంబంలోని గొడవలకు ఫుల్ స్టాప్ పడితే బాగుంటుందని అన్నాడు.
తన ఎదుట శివుడు ప్రత్యక్షమై వరమిస్తానంటే... ఎన్ని జన్మలకైనా తనకు తండ్రిగా మోహన్ బాబే ఉండాలని కోరుకుంటానని చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విష్ణు ఈ వ్యాఖ్యలు చేశాడు.
సినిమాల విషయానికి వస్తే... విష్ణు తాజా చిత్రం 'కన్నప్ప' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో మోహన్ బాబు, విష్ణు ఇద్దరు కూతుళ్లు అరియానా, వివియానా, కొడుకు మంచు అవ్రామ్ నటించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లతో పాటు కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల, ఐశ్వర్య, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విష్ణు ప్రమోషన్లు మొదలు పెట్టాడు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదల కానుంది.