Virat Kohli: విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించిన పాక్ కెప్టెన్

- ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ పై భారత్ విజయం
- నిన్న దుబాయ్ లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్
- సెంచరీతో రాణించిన కోహ్లీ
టీమిండియా గ్రేట్ విరాట్ కోహ్లీ, పాక్ బ్యాటింగ్ స్టార్ బాబర్ అజామ్ లలో ఎవరు గొప్ప అనే చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. నిన్నటి మ్యాచ్ లో బాబర్ అజామ్ 23 పరుగులు చేసిన నిరాశపర్చితే... విరాట్ కోహ్లీ సెంచరీ సాధించి టీమిండియాకు అపురూప విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో, పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ కూడా కోహ్లీ ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఈ మ్యాచ్ కోసం కోహ్లీ ఎంత కఠోరంగా శ్రమించి ఉంటాడో నిన్నటి ఇన్నింగ్స్ చూశాక అర్థమైందని అన్నాడు. పరుగులు ఇవ్వకుండా కోహ్లీని కట్టడి చేయాలని భావించామని, కానీ తమ ప్రణాళికలను కోహ్లీ చిత్తు చేశాడని, ఎంతో ఈజీగా పరుగులు చేసి తమకు మ్యాచ్ ను దూరం చేశాడని రిజ్వాన్ వివరించాడు.
కోహ్లీ ఫిట్ నెస్ మెయింటైన్ చేసే విధానాన్ని ఎవరైనా మెచ్చుకుని తీరాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. అతడూ క్రికెటరే... మేం కూడా క్రికెటర్లమే... కానీ ఫిట్ నెస్ పరంగా కోహ్లీ ఎంతో శ్రమిస్తాడని రిజ్వాన్ వ్యాఖ్యానించాడు.
కోహ్లీని అవుట్ చేయడానికి నిన్న తాము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, ఫామ్ లో లేడని అందరూ చెబుతున్నారు... కానీ నిన్న భారీ ఇన్నింగ్స్ ఆడి తమ నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడని రిజ్వాన్ కొనియాడాడు.