Jagan: అసెంబ్లీకి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం... వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక భేటీ

- వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న జగన్
- తాను మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని ధీమా
- 2028 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు వస్తాయని వెల్లడి
ఏపీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. ఈరోజు జగన్, ఇతర వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరైన సంగతి తెలిసిందే. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ సభలో ఆ పార్టీ సభ్యులు నిరసన చేపట్టారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత తాడేపల్లిలోని కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు మనం హాజరుకావడం లేదని తెలిపారు. మరో 30 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానని... తనతో పాటు ఉండేవాళ్లే తనవాళ్లు అని చెప్పారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు. 2028 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు వస్తాయని చెప్పారు.