Pawan Kalyan: ఫిక్స్ అయిపోండి... ఈ ఐదేళ్లలో మీకు ప్రతిపక్ష హోదా రాదు: వైసీపీపై పవన్ ఘాటు వ్యాఖ్యలు

YSRCP will not get opposition status says Pawan Kalyan
  • జనసేనకు వచ్చినన్ని సీట్లు కూడా వైసీపీకి రాలేదని పవన్ ఎద్దేవా
  • ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇస్తారని వ్యాఖ్య
  • రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అన్న పవన్
వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలంటూ ఏపీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 11 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వైసీపీ సభ్యులు... ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీ డిమాండ్ పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్ష హోదా అనేది ముఖ్యమంత్రి, స్పీకర్ ఇస్తే తీసుకునేది కాదని... ఆ హోదాను ప్రజలు ఇస్తారని పవన్ చెప్పారు. వైసీపీకి ప్రజలు కేవలం 11 సీట్లను మాత్రమే ఇచ్చారని... రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని... జనసేనకు వచ్చినన్ని సీట్లు కూడా వైసీపీకి రాలేదని ఎద్దేవా చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని చెప్పారు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చి ఉన్నా ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్లమని తెలిపారు. 

ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభను అడ్డుకుంటామంటే కుదరదని పవన్ అన్నారు. సభకు వచ్చిన వెంటనే ఆందోళన చేయడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఈ ఐదేళ్లలో మీకు ప్రతిపక్ష హోదా రాదు... ఫిక్స్ అయిపోండని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిబంధనలు ఉన్నాయని అన్నారు. 

జ్వరంతో బాధపడుతున్నప్పటికీ అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ రెండు గంటల సేపు ప్రసంగించారని... ఆయన ప్రసంగాన్ని అడ్డుకుకోవడానికి వైసీపీ యత్నించడం దారుణమని అన్నారు. వైసీపీ నేతలు హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలని చెప్పారు. ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి సభకు రావాలని... మీకు వచ్చిన సీట్లకు అనుగుణంగా సభలో మాట్లాడేందుకు స్పీకర్ సమయాన్ని కేటాయిస్తారని అన్నారు. 
Pawan Kalyan
Janasena
YSRCP

More Telugu News