Kinjarapu Acchamnaidu: 11 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదా కోరడం హాస్యాస్పదం: అచ్చెన్నాయుడు

- అటెండెన్స్ కోసమే వచ్చి వెళ్లారంటూ జగన్ పై మండిపాటు
- సభ్యత్వాలు పోతాయనే భయంతోనే వచ్చారని భావిస్తున్నామన్న మంత్రి
- ప్రజా సమస్యలపై సభలో మాట్లాడతారని అనుకున్నామని వెల్లడి
హాజరు వేయించుకుని వెళ్లడానికే వైసీపీ అధినేత జగన్, ఆయన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినట్లుందని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఉదయం సభకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు పది నిమిషాలు కూడా ఉండకుండానే బాయ్ కాట్ చేసి వెళ్లిపోవడాన్ని తప్పుబట్టారు. సభలో ప్రజా సమస్యలపై వారు మాట్లాడతారని తాము భావించామని మంత్రి తెలిపారు. అయితే, వైసీపీ ఎమ్మెల్యేల తీరు అటెండెన్స్ కోసమే, సభ్యత్వం పోతుందేమోననే ఆందోళనతోనే వచ్చినట్లుగా ఉందని విమర్శించారు.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని డిమాండ్ చేయడం ఎక్కడా చూడలేదని ఆయన అన్నారు. కేవలం పదకొండు సీట్లు గెలుచుకున్న పార్టీ ప్రతిపక్ష హోదా అడగడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఆ పార్టీలోని సీనియర్ నేతలు కూడా జగన్ కు మద్దతు పలకడం దురదృష్టకరమని అన్నారు. అవినీతి, అబద్ధాల పునాదులపై వైసీపీ పుట్టిందని, గతంలో చెప్పిన అవాస్తవాలనే మళ్లీ చెబుతున్నారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.