Viral Video: ఢిల్లీకి వెళుతున్న అమెరికా విమానానికి బాంబు బెదిరింపు.. ఎస్కార్ట్‌గా ఫైటర్ జెట్లు.. రోమ్‌లో అత్యవసర ల్యాండింగ్.. వీడియో ఇదిగో!

Delhi bound US flight escorted by fighter jets to Rome
  • 199 మంది ప్రయాణికులతో న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం
  • కాస్పియన్ సముద్రం మీదుగా వెళుతుండగా బాంబు ఉన్నట్టు పైలట్‌కు సమాచారం
  • ఆ వెంటనే ఇటలీ రాజధానికి మళ్లింపు
  • ఎస్కార్ట్‌గా యుద్ధ విమానాలను పంపిన ఇటలీ
   న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని బాంబు బెదిరింపు హెచ్చరికల నేపథ్యంలో రోమ్‌కు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే, ఈ-మెయిల్ ద్వారా అందుకున్న బాంబు బెదిరింపు ఒట్టిదేనని ఆ తర్వాత నిర్ధారించారు. విమానం రోమ్‌లోని లియోనార్డో డావిన్సీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని, తనిఖీ అనంతరం విమానానికి క్లియరెన్స్ వచ్చిందని ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు తెలిపారు. నేడు (సోమవారం) తిరిగి విమానం ఢిల్లీకి బయలుదేరుతుందని చెప్పారు. 

అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ‘బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్’ ఆదివారం రాత్రి 199 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరింది. విమానం కాస్పియన్ సముద్రం మీదుగా ఎగురుతుండగా విమానంలో బాంబు ఉన్నట్టు పైలట్‌కు సమాచారం అందింది. దీంతో వెంటనే విమానాన్ని ఇటలీ రాజధాని రోమ్‌కు మళ్లించారు. సమాచారం అందుకున్న ఇటలీ ఎయిర్‌ఫోర్స్ అధికారులు అమెరికన్ విమానానికి ఎస్కార్ట్‌గా యుద్ధ విమానాలను పంపించారు.  వాటి రక్షణ మధ్య అమెరికా విమానం సురక్షితంగా రోమ్‌లో ల్యాండ్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను దింపి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అనంతరం బాంబ్ బెదిరింపు కాల్ ఒట్టిదేనని తేల్చి విమానం ఢిల్లీకి వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చారు.  
Viral Video
New York
Delhi
American Airlines Filght
Bomb Threat

More Telugu News