AP Assembly Session: కాసేపట్లో ప్రారంభంకానున్న ఏపీ బడ్జెట్ సమావేశాలు.. హాజరు కానున్న జగన్

- 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభంకానున్న సమావేశాలు
- అసెంబ్లీ వద్ద భారీ భద్రత ఏర్పాటు
ఏపీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభంకానున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.
20 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. సమావేశాల నేపథ్యంలో శాసనసభ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి అసెంబ్లీకి వెళ్లే మార్గంలో కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఆవరణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పీఏలకు అనుమతి లేదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులను కలిసేవారు అసెంబ్లీకి కాకుండా నేరుగా సీఎంవోకు వెళ్లాలని ఆదేశించారు.
మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని వైసీపీ నిర్ణయించినట్టు సమాచారం. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని గతంలో చెప్పిన జగన్... ఈరోజు సభకు హాజరు కావాలని నిర్ణయించారు. ఏ సభ్యుడైనా సభకు 60 రోజుల పాటు హాజరుకాకపోతే వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారం సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్ కు ఉంటుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రావాలని నిర్ణయించినట్టు సమాచారం.
గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏ అంశాలపై చర్చించాలి? అనే దానిని నిర్ణయిస్తారు.