Shashi Tharoor: నాకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి.. పార్టీ మార్పు వార్తలపై శశిథరూర్

Congress leader Shashi Tharoor said he has alternative ways

  • ప్రధాని మోదీని, కేరళ ప్రభుత్వాన్ని ప్రశంసించిన శశిథరూర్
  • సొంత పార్టీలో కలకలం రేపిన వ్యాఖ్యలు
  • ప్రతిసారీ పార్టీ ప్రయోజనాల కోసమే మాట్లాడలేనని స్పష్టీకరణ
  • కేరళ సీఎం పదవికి తాను అర్హుడినన్న సీనియర్ నేత

తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ స్పందించారు. ప్రస్తుతానికి తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, పార్టీ కనుక తన సేవలను వినియోగించుకోకూడదని భావిస్తే తనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని స్పష్టం చేశారు. శశిథరూర్ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీని, కేరళలోని వామపక్ష ప్రభుత్వాన్ని ప్రశంసించారు. దీంతో సొంత పార్టీలో ఇవి కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరిగింది.

ఈ ప్రచారంపై తాజాగా శశిథరూర్ స్పందించారు. దేశ, రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే తాను అలా మాట్లాడానని, ప్రతిసారీ పార్టీ ప్రయోజనాల కోసమే మాట్లాడటం తనకు చేతకాదని తేల్చి చెప్పారు. తానెప్పుడూ సంకుచితంగా ఉండనని పేర్కొన్నారు. కేరళలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయడం ద్వారా పార్టీని విస్తరించాలని పిలుపునిచ్చారు. లేదంటే వరుసగా మూడోసారి కూడా ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేరళ ముఖ్యమంత్రి పదవికి తాను అర్హుడినని శశిథరూర్ పేర్కొన్నారు. పలు ఒపీనియన్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పాయని గుర్తు చేశారు. 

  • Loading...

More Telugu News