Virat Kohli: కోహ్లీ 100 నాటౌట్.... పాక్ పై భారత్ చిరస్మరణీయ విజయం

Kohli century steers India win against Pakistan

  • ఐసీసీ ఈవెంట్లలో పాక్ పై ఆధిపత్యాన్ని నిలుపుకున్న భారత్
  • ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో ఘనవిజయం
  • 6 వికెట్ల తేడాతో పాక్ ను ఓడించిన టీమిండియా
  • 111 బంతుల్లో 100 పరుగులు చేసిన కోహ్లీ
  • రాణించిన శ్రేయాస్ అయ్యర్, శుభ్ మన్ గిల్ 

ఐసీసీ మేజర్ ఈవెంట్లలో పాకిస్థాన్ పై తన ఆధిపత్యాన్ని భారత్ మరోసారి ఘనంగా చాటుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఏలో నేడు జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ (100 నాటౌట్) అద్భుత సెంచరీ సాధించిన వేళ... టీమిండియా 6 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది. ఈ విజయంతో భారత్ సెమీస్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది.

దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా బౌలర్లు విజృంభించడంతో పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం, 242 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా సునాయాసంగా విజయాన్ని అందుకుంది. కేవలం 4 వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలో 244 పరుగులు చేసింది. 

టీమిండియా ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచిన కోహ్లీ 111 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేశాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు ఉన్నాయి. విన్నింగ్ షాట్ ఫోర్ కొట్టిన కోహ్లీ అటు  సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా, ఇటు  జట్టుకు విజయాన్ని అందించాడు. కోహ్లీకిది వన్డేల్లో 51వ సెంచరీ కాగా, పాకిస్థాన్ పై నాలుగోది. 

అంతకుముందు, కెప్టెన్ రోహిత్ శర్మ 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 20 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 46, శ్రేయాస్ అయ్యర్ 56 పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా 8 పరుగులకే వెనుదిరిగినా... అక్షర్ పటేల్ (3 నాటౌట్) తో కలిసి కోహ్లీ మిగతా పని పూర్తి చేశాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్ 1, కుష్ దిల్ షా 1 వికెట్ తీశారు. 

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ దశలో టీమిండియాకు ఇది వరుసగా రెండో విజయం కాగా... పాకిస్థాన్ కు వరుసగా రెండో ఓటమి. ఈ ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలు బాగా దెబ్బతిన్నాయి. గ్రూప్-ఏలో తాను ఆడిన రెండు మ్యాచ్ ల్లో విజయాలతో టీమిండియా టాప్ లో ఉంది. పాక్ అట్టడుగున ఉంది. రెండో స్థానంలో న్యూజిలాండ్, మూడో స్థానంలో బంగ్లాదేశ్ ఉన్నాయి. టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్ ను న్యూజిలాండ్ తో మార్చి 2న ఆడనుంది.

Virat Kohli
Team India
Pakistan
Champions Trophy 2025
Dubai
  • Loading...

More Telugu News