Nara Lokesh: దుబాయ్ లో భారత్-పాక్ మ్యాచ్... స్టేడియంలో సందడి చేసిన నారా లోకేశ్

- ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు భారత్-పాక్
- దుబాయ్ లో మ్యాచ్
- కుమారుడు దేవాన్ష్ తో కలిసి హాజరైన నారా లోకేశ్
- టీమిండియా జెర్సీలు ధరించి, త్రివర్ణ పతాకం చేతబూనిన లోకేశ్, దేవాన్ష్
ప్రభుత్వ పాలన, పార్టీ వ్యవహారాలతో ఎంతో బిజీగా ఉండే ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్ కు హాజరయ్యారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు వేదికైన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నారా లోకేశ్ సందడి చేశారు. ఆయన వెంట కుమారుడు నారా దేవాన్ష్ కూడా ఉన్నాడు. వీరిరువురు టీమిండియా జెర్సీలు ధరించి... త్రివర్ణ పతాకం చేతబూని... భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.
ముఖ్యంగా, భారత క్రికెట్ వ్యవస్థ రథ సారథి, ఐసీసీ చైర్మన్ జై షాను నారా లోకేశ్ నేడు దుబాయ్ లో కలిశారు. జై షాను కలవడం సంతోషం కలిగించిందని, ఏపీలో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించామని నారా లోకేశ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధి పట్ల తనతో పాటు జై షా కూడా ఆసక్తిగా ఉన్నారని వివరించారు.
కాగా, ఈ మ్యాచ్ కు ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్, టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ కూడా హాజరయ్యారు. వారు మంత్రి నారా లోకేశ్ తో కలిసి మ్యాచ్ వీక్షించారు.


