AP Assembly Session: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు... అధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమీక్ష

- ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- రేపు ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్యేలందరూ సభకు రావాలన్న స్పీకర్ అయ్యన్న
- ఎమ్మెల్యేల పీఏలకు పాస్ లు ఉండవని వెల్లడి
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రేపు (ఫిబ్రవరి 24) తెరలేవనుంది. ఈ నేపథ్యంలో, అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, రేపు ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హాజరుకావాలని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేల పీఏలకు పాస్ లు ఉండవని తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చే సందర్శకులను అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించబోరని వెల్లడించారు. అసెంబ్లీ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోలీసులను ఆదేశించారు.
కాగా, అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ ను, కొత్తగా నిర్మిస్తున్న క్యాంటీన్ ను స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేడు పరిశీలించారు.