Vasundhara Oswal: ఉగాండా జైల్లో భారత బిలియనీర్ కూతురి కష్టాలు

- కిడ్నాప్, హత్యా నేరంపై అరెస్టయిన వసుంధర ఓస్వాల్
- హత్యకు గురైనట్టుగా భావిస్తున్న వ్యక్తి టాంజానియాలో సజీవంగా ప్రత్యక్షం
- ఎట్టకేలకు జైలు నుంచి బయటికొచ్చిన వసుంధర
ఆఫ్రికా దేశం ఉగాండాలో భారత సంతతి బిలియనీర్ పంకజ్ ఓస్వాల్ కుమార్తె వసుంధర ఓస్వాల్ అనూహ్య రీతిలో జైలుపాలయ్యారు. తన తండ్రి వద్ద పనిచేసిన ముఖేశ్ మెనారియా అనే మాజీ ఉద్యోగిని అపహరించి, హత్య చేసినట్టు 26 ఏళ్ల వసుంధర ఓస్వాల్ పై తీవ్ర అభియోగాలు మోపారు. ఆమెను గతేడాది అక్టోబరు 1న అరెస్ట్ చేశారు. ఆమెను మూడు వారాల పాటు రిమాండ్ లో ఉంచారు. అయితే, హత్యకు గురైనట్టు భావించిన మాజీ ఉద్యోగి కొన్ని రోజుల తర్వాత టాంజానియాలో సజీవంగా ప్రత్యక్షం కావడంతో ఈ కేసు వీగిపోయింది.
ఈ వ్యవహారంపై వసుంధర తాజాగా స్పందించారు. తనను అన్యాయంగా జైల్లో ఉంచారని, తన విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆమె ఆక్రోశించారు.
"జైల్లో నేను నరకాన్ని అనుభవించాను. తొలుత అరెస్ట్ చేసి ఐదు రోజుల పాటు నిర్బంధించారు. రెండు వారాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. స్నానం చేసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఆహారం, నీళ్లు ఇవ్వకుండా వేధించారు. జైల్లో నా కనీస అవసరాలు తీర్చేందుకు మా అమ్మానాన్న పోలీసు అధికారులకు లంచం ఇవ్వాల్సి వచ్చింది. ఓ దశలో వాష్ రూమ్ కు కూడా వెళ్లనివ్వలేదు. ఎందుకు పంపించరు అని అడిగితే.. నీకు ఇదే శిక్ష అన్నారు.
ఆ రోజు తప్పుడు ఆరోపణలతో మా ఇంట్లో సోదాలు చేశారు. వారెంట్ ఉందా అని అడిగితే... ఇది మా ఉగాండా.... మేం ఏమైనా చేస్తాం... నువ్వు ఉన్నదేమీ యూరప్ కాదు అని దురుసుగా జవాబిచ్చారు. ఓ పురుష పోలీసాఫీసర్ ఎంతో మొరటుగా ప్రవర్తించాడు. నన్ను పోలీస్ వ్యాన్ లోకి తోసేశాడు.
పోలీస్ బాండ్ కింద రూ.26 లక్షలు కట్టించుకున్నారు... నా పాస్ పోర్టును లాగేసుకున్నారు. క్రిమినల్ న్యాయవాది లేకుండానే బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారు. బెయిల్ వచ్చినప్పటికీ 72 గంటల పాటు అక్రమంగా నిర్బంధించారు.
మాజీ ఉద్యోగి ముఖేశ్ మెనారియా బతికే ఉన్నాడని తెలిసిన తర్వాత కూడా నాపై కేసును తొలగించేందుకు ఉగాండా పోలీసులు ససేమిరా అన్నారు. అతడ్ని కిడ్నాప్ చేసి, హత్య చేసేందుకు ప్రయత్నించింది అంటూ కేసును మార్చేందుకు యత్నించారు.
మొదట నన్ను సాధారణ నేరస్తులు ఉండే జైల్లో ఉంచారు. ఆ తర్వాత హత్య కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్నవారు, మానవ అక్రమరవాణాదారులు ఉండే నకసొంగోలా జైలుకు తరలించారు. ఆ జైల్లో ప్రాణభయంతో రెండు వారాల పాటు నరకం చవిచూశాను. న్యాయపోరాటాల అనంతరం అక్టోబరు 21న కోర్టు నాకు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ డిసెంబరు 10వ తేదీ నాడు నా పాస్ పోర్టు అప్పగించారు. చివరికి డిసెంబరు 19వ తేదీన నాపై కేసును కొట్టివేశారు. ఉగండా పోలీసు అధికారులు డబ్బు కోసం ఒత్తిడి చేశారు. మెనారియా బతికున్నాడని తెలిసి కూడా అవినీతికి పాల్పడ్డారు" అని వసుంధర ఓస్వాల్ వివరించారు.
ఈ వ్యవహారాన్ని ఉగండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని ఆమె వెల్లడించారు. అనేక సంవత్సరాలుగా ఉగాండాలో తాము పెట్టుబడులు పెడుతున్నామని, తమతో ఇలాగేనా వ్యవహరించేది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
