YS Sharmila: రాష్ట్ర రైతాంగాన్ని ఎర్రబంగారం ఏడిపిస్తోంది: షర్మిల

- ఏపీలో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్న షర్మిల
- నష్టాల ఘాటుకు మిర్చి రైతు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని ఆవేదన
- కూటమి ప్రభుత్వం మిర్చి రైతుల కళ్లతో కారం కొడుతోందని ఆగ్రహం
ఏపీలో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని ఎర్రబంగారం (మిర్చి) ఏడిపిస్తోందని, మిర్చి పంట నష్టాల ఘాటుకు రైతన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కూడా రాక క్వింటాకు రూ.15 వేల నష్టంతో అమ్ముకుంటుంటే... అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం మిర్చి రైతుల కళ్లలో కారం కొడుతోందని మండిపడ్డారు.
"మిర్చి రైతులకు రూ.11 వేల మద్దతు ధర ఇచ్చి ఉద్ధరించినట్టు కూటమి ప్రభుత్వం గప్పాలు కొడుతోంది. ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పెడితే, ఆ లక్షన్నర కూడా రావడంలేదని రైతులు కంటతడి పెడుతున్నారు. కౌలు రైతుకు మరో రూ.50 వేలు అదనంగా నష్టం అంటూ అల్లాడుతున్నారు.
రాష్ట్ర రైతులపై కేంద్రానికి నిజంగా ప్రేమే ఉంటే మిర్చి కనీస ధరను రూ.26 వేలుగా ప్రకటించాలి. లేకపోతే, మిర్చి రైతును ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి వెంటనే అమలు చేయాలి. కేంద్రం ఇచ్చే ధరకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మిర్చి రైతుకు బోనస్ ప్రకటించాలి.
ఓవైపు మిర్చి రైతు విలవిల్లాడుతుంటే, మరోవైపు టమాటా రైతులకు తీరని కష్టాలు వచ్చిపడ్డాయి. గిట్టుబాటు ధర లేక, కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రాక రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో టమాటా కిలో రూ.15 పలుకుతుంటే... రైతుకు కిలో మీద మూడ్నాలుగు రూపాయలు కూడా రావడంలేదు. వెంటనే టమాటా రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. టమాటా ధరలు పడిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలి" అంటూ షర్మిల డిమాండ్ చేశారు.