KTR: కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచం: కేటీఆర్

- రేవంత్ రెడ్డిని బీజేపీ కాపాడుతోందన్న కేటీఆర్
- సరైన సమయంలో బీజేపీలో చేరతానని రేవంత్ హామీ ఇచ్చినట్టుందని వ్యాఖ్యలు
- కేంద్రానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మౌనంగానే ఉంటోందని ఆగ్రహం
కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంలా నిలుస్తోందని అన్నారు. అమృత్ టెండర్లు మొదలు సివిల్ సప్లయిస్ స్కాం వరకు... కేంద్రం నిధులు పక్కదారి పట్టించినా కానీ బీజేపీ అతడ్ని కాపాడుతోందని ఆరోపించారు. సాక్ష్యాధారాలతో అనేక సార్లు కేంద్రానికి ఫిర్యాదు చేశామని, కేంద్రం మౌనంగానే ఉంటోందని కేటీఆర్ మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రమాదంపై ఆగమేఘాలపై స్పందించిన కేంద్రం... మొన్నటి సుంకిశాల, నిన్నటి ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ కాపాడుతోందనేది మిలియన్ డాలర్ వ్యవహారంలా మారిందని అన్నారు. సరైన సమయంలో బీజేపీలో చేరతానని రేవంత్ హామీ ఇచ్చినందునే... కేంద్రం ఆయనను కాపాడుతోందనే అనుమానం కలుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.