G. Kishan Reddy: కాంగ్రెస్ అభయ హస్తం... మొండి హస్తంలా మారింది: కిషన్ రెడ్డి

- తెలంగాణ సర్కారుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు
- రోజుకో ప్రకటన తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని వ్యాఖ్యలు
- 14 నెలలకే ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారని వెల్లడి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ అభయ హస్తం... మొండి హస్తంలా మారిందని అన్నారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని ఆరోపించారు. నిరుద్యోగులు, టీచర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో ప్రకటన తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని కిషన్ రెడ్డి విమర్శించారు.
"రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించే పరిస్థితి కనిపించడంలేదు. కేవలం 14 నెలల పాలనలోనే ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా అని తెలంగాణ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు" అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.