Champions Trophy 2025: పాకిస్థాన్ గెలిస్తే మజా ఉంటుంది.. భారత-పాక్ మ్యాచ్‌కు ముందు టీమిండియా మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

- పాక్ గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పిన అతుల్ వాసన్
- అప్పుడే టోర్నీ రసవత్తరంగా ఉంటుందన్న మాజీ ఆటగాడు
- భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్‌కు భారీ ఎదురుదెబ్బ
- గత చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై సెంచరీ చేసిన ఆటగాడు
హైటెన్షన్ మ్యాచ్‌కు భారత్-పాకిస్థాన్ జట్లు సిద్ధమైన వేళ టీమిండియా మాజీ ఆటగాడు అతుల్ వాసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేశమంతా భారత జట్టు గెలవాలని ప్రార్థనలు చేస్తున్న వేళ.. అతుల్ వాసన్ మాత్రం పాకిస్థాన్ జట్టు గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఇండియా గెలిస్తే ఏముంటుందని, పాక్ గెలిస్తే మజా ఉంటుందని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్‌ను గెలవనివ్వకపోతే ఏమీ చేయలేమన్నాడు. ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ లాంటి వాటిలో పాకిస్థాన్ గెలిస్తేనే అది పోటీ అవుతుందని అభిప్రాయపడ్డాడు.
కాగా, భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గాయపడిన స్టార్ బ్యాటర్ ఫకర్ జమాన్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. గత చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫకర్ జమాన్ స్టన్నింగ్ సెంచరీతో జట్టుకు తొలి ట్రోఫీని అందించిపెట్టాడు. గాయపడిన ఫకర్ జమాన్ స్థానంలో ఇమాముల్ హక్ జట్టులోకి వచ్చాడు.