Mumbai: బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫీసులో రూ.40 లక్షలు చోరీ... నిందితుడి అరెస్ట్

- బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ చక్రవర్తి కార్యాలయంలో చోరీ
- రూ.40 లక్షల నగదు బ్యాగ్‌తో పరారైన ఆఫీసు బాయ్ అశీశ్ సాయల్
- జమ్మూకశ్మీర్ లో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ చక్రవర్తి కార్యాలయంలో చోరీ జరిగిన కేసులో ముంబై పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తన కార్యాలయంలో రూ.40 లక్షలు చోరీ జరిగిందని ప్రీతమ్ చక్రవర్తి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంట్లో సరుకులు తీసుకురావాలని చెప్పి తన ఆఫీస్ బాయ్ అశీశ్ సాయల్ రూ.40 లక్షల నగదు ఉన్న బ్యాగుతో పరారయ్యాడని ప్రీతమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన ముంబై పోలీసులు, విచారణలో భాగంగా దాదాపు 200 సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. చోరీ సొమ్ముతో పరారీలో ఉన్న సాయల్‌ను జమ్మూకశ్మీర్‌లో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసు విషయమై పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. దొంగతనం చేసిన తర్వాత సాయల్ ముంబై నుంచి అమృత్‌సర్‌కు విమానంలో వెళ్లాడని, అక్కడి నుంచి బస్సులో కశ్మీర్‌కు చేరుకున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో సాయల్ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అతన్ని జమ్మూకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి రూ.34 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.