Andhra Pradesh: ఏపీలో రిపోర్ట్ చేయడానికి వీలుగా... ఇద్దరు ఐపీఎస్ అధికారులను రిలీవ్ చేసిన తెలంగాణ

- అంజనీ కుమార్, అభిలాష బిస్త్‌ను రిలీవ్ చేసిన తెలంగాణ
- జీవో జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
- కరీంనగర్ పోలీస్ కమిషనర్ రిలీవ్‌పై ఈసీకి ప్రభుత్వం లేఖ
ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిస్త్‌ను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా వారిని వెంటనే రిలీవ్ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవోలో పేర్కొన్నారు. అలాగే, కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి రిలీవ్‌పై ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం లేఖ రాసింది.
కరీంనగర్‌లో ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నందున అభిషేక్ మహంతి విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు.
అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని కేంద్ర హోంశాఖ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన అనంతరం డీవోపీటీ రెండు తెలుగు రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారులను కేటాయించింది. దీనిపై కొందరు అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. తర్వాత డీవోపీటీ హైకోర్టులో పిటిషన్ వేసింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్‌లను ఏపీలో రిపోర్ట్ చేయాలని హోంశాఖ ఆదేశించింది.