KTR: ఎస్ఎల్‌బీసీ ప్రమాదంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల పట్ల కేటీఆర్ ఆగ్రహం

- సీపేజ్ వచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్న కేటీఆర్
- ఉదయం ప్రమాదం జరిగితే మధ్యాహ్నం వరకు ప్రభుత్వంలో చలనం లేదని విమర్శ
- టన్నెల్‌లో ఎంతమంది ఉన్నారో చెప్పాలన్న కేటీఆర్
ఎస్ఎల్‌బీసీ ప్రమాద ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపేజ్ వచ్చిందని, అందుకే టన్నెల్ కూలిందని మంత్రి చెప్పడం విడ్డూరమని ఆయన అన్నారు. ఈ ప్రమాద ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్ఎల్‌బీసీ పనులు నాలుగు రోజుల క్రితమే మొదలయ్యాయని, కానీ జరిగిన ప్రమాదాన్ని దాచిపెట్టడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు వారి ఆలోచనలకు అద్దం పడుతున్నాయని ఆయన అన్నారు. ప్రమాదం ఉదయం ఎనిమిదిన్నరకు జరిగితే మధ్యాహ్నం వరకు ప్రభుత్వంలో చలనం లేదని, ఇది దురదృష్టకరమని అన్నారు.
ఇప్పటి వరకు ఎంతమంది కార్మికులు టన్నెల్‌లో చిక్కుకున్నారో తెలియని పరిస్థితి నెలకొని ఉందన్నారు. సీపేజ్ వచ్చిందని, అందుకే టన్నెల్ కూలిందని చెబుతున్నారని, సీపేజ్ వచ్చినప్పుడు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. సుంకిశాల ప్రమాదంలా దీనిని కూడా దాచిపెట్టే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. టన్నెల్‌లో ఎంతమంది ఉన్నారు? వారిని రక్షించడానికి ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? అని నిలదీశారు.