SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

- ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయిన వైనం
- హుటాహుటీన హెలికాప్టర్ లో ఘటనస్థలికి చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్
- సహాయక చర్యల పర్యవేక్షణ
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఆయన హెలికాప్టర్ లో టన్నెల్ వద్దకు చేరుకున్నారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా టన్నెల్ కూలిపోయిన ప్రదేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉదయం 8 గంటలకు కార్మికులు సొరంగం లోపలికి వెళ్లారని, ఉదయం 8.30 గంటలకు బోరింగ్ మెషీన్ ను ఆన్ చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 20 మీటర్లు డ్రిల్లింగ్ చేయగానే టన్నెల్ లోకి నీళ్లు లీక్ అయ్యాయని వివరించారు. టన్నెల్ లో ఒకవైపు నుంచి నీరు లీక్ కావడంతో మట్టి కుంగిపోయిందని తెలిపారు.
బోరింగ్ మెషీన్ ఆపరేటర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టాడని, దాంతో బోరింగ్ మెషీన్ వెనకున్న 42 మంది కార్మికులను బయటికి పంపించివేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. బోరింగ్ మెషీన్ కు ముందున్న 8 మంది బయటికి రాలేక టన్నెల్ లోపల చిక్కుకున్నారని తెలిపారు. వారిలో ఇద్దరు విదేశీ ఇంజినీర్లు, ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. విదేశీ ఇంజినీర్లు మినహా మిగిలిన వారు యూపీ, ఝార్ఖండ్ కు చెందిన వారు అని వివరించారు.
సొరంగంలో చిక్కుకున్న 8 మందిని ప్రాణాలతో కాపాడేందుకు సర్వశక్తులా కృషి చేస్తున్నామని అన్నారు. 14 కిలోమీటర్ల లోపల ఉన్నందున సహాయ చర్యలు క్లిష్టంగా మారాయని తెలిపారు. ఇలాంటి ఆపరేషన్స్ లో నిపుణలైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తీసుకువస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.