Revanth Reddy: రాహుల్ గాంధీ ఆశయం మేరకే...!: బీసీ కులగణనపై రేవంత్ రెడ్డి

- బీసీ కులగణన సర్వేపై అనుమానాల నివృత్తి
- రేవంత్ రెడ్డి మీడియా సమావేశం
- కులగణన చారిత్రాత్మకమైన నిర్ణయమన్న ముఖ్యమంత్రి
- కులగణన విషయంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడి
బీసీ కులగణన ఒక సాహసోపేత నిర్ణయమని, రాహుల్ గాంధీ ఆశయం మేరకే సమగ్ర కులగణన చేపట్టామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ కులగణన సర్వేపై అనుమానాల నివృత్తిపై ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కులగణన చేపట్టడం ద్వారా తమ ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందని అన్నారు. కులగణన విషయంలో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
రాహుల్ గాంధీ సుమారు 25 రోజుల పాటు తెలంగాణలో పాదయాత్ర చేశారని, సోనియా గాంధీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తెలంగాణను ఇచ్చారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చిన తర్వాతే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. త్రికరణ శుద్ధిగా లెక్కలు తేల్చామని, వందేళ్లలో జరగని దానిని 100 శాతం సరైన లెక్కలను తేల్చామని ఆయన అన్నారు.
ఈ సర్వే పూర్తి పారదర్శకంగా జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వంలోని 15 శాఖలకు చెందిన అధికారుల ద్వారా, మొత్తం 8 పేజీలతో ఇంటి యజమాని ఇచ్చిన సమాచారాన్ని సేకరించామని తెలిపారు. సుమారు కోటీ పన్నెండు లక్షల కుటుంబాలు కులగణన సర్వేలో పాల్గొన్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. న్యాయపరంగా, చట్టపరంగా, నిబంధనలకు లోబడి సర్వే చేసినట్లు చెప్పారు. 96.9 శాతం మంది సర్వేలో పాల్గొనగా, 3.1 శాతం మంది పాల్గొనలేదని తెలిపారు.
కొంతమంది నాయకులు కులగణనకు దూరంగా ఉన్నారని విమర్శించారు. గత బీఆర్ఎస్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో నాలుగు విభాగాలుగా జనాభా శాతాన్ని చెప్పగా, తాజా సర్వేలో 5 విభాగాలు ఉన్నట్లు చెప్పారు. ముస్లింలలోని ఓబీసీలను నాడు ప్రత్యేకంగా చెప్పలేదని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాల్సిన అవశ్యకత ఉందని ముఖ్యమంత్రి అన్నారు.
రాహుల్ గాంధీ ప్రధాని అయితే అన్ని రాష్ట్రాల్లో కులగణన జరుగుతుందని జోస్యం చెప్పారు. కులగణన జరగకపోతే బీసీలు నష్టపోతారని హెచ్చరించారు. మంచి చేసిన తనను రాళ్లతో కొడతామంటే నష్టపోయేది బీసీలే అన్నారు.
బీసీ జనాభా ప్రకారం వారికి అవకాశం కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కులగణనకు చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. "బీసీ మిత్రులకు నా విజ్ఞప్తి. మీ కోసం నేను నా శక్తి మేరకు సాహసం చేశా. దీనిని సొంతం చేసుకోవాల్సిన బాధ్యత మీదే" అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.