Vinod Kumar: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ లేఖ

Vinod Kumar letter to Revanth Reddy

  • నీళ్లు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్న మాజీ ఎంపీ
  • విమర్శలు మానుకొని కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని సూచన
  • మరమ్మతుల కోసం అనుమతులు అవసరం లేదన్న మాజీ ఎంపీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. మేడిగడ్డ బ్యారేజీకి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆ లేఖలో కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇకనైనా విమర్శలు మానుకొని, పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. నీళ్లు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా ప్రాణహిత నుంచి నీటిని ఎత్తిపోసి పంటలకు నీరు అందించాలన్నారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుకు యాసంగి పంటకు నీళ్లివ్వలేమని గత డిసెంబర్‌లో అధికారులతో ప్రకటన చేయించారని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని వినోద్ కుమార్ అన్నారు. ఇప్పుడేమో రైతు సమితి చైర్మన్ కోదండరెడ్డి పంటలు వేయవద్దని రైతులకు సూచించడం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని నీటి సరఫరా వ్యవస్థపై అధికార పార్టీ నాయకులకు అవగాహన లేదని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా పంట దిగుబడి సాధించామని చెబుతున్నారని విమర్శించారు.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాక మొదటి పదేళ్లు రికార్డుస్థాయిలో పంట దిగుబడిని పెంచితే, కాంగ్రెస్ ఏడాది పాలనలో పంటలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితికి చేరుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు యజమానిగా తెలంగాణ ప్రభుత్వం మరమ్మతులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నేషనల్ అథారిటీ కేవలం సూచనలు, సలహాల కోసమే ఉందని తెలిపారు.

లక్ష ఎకరాలకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకొని కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును, రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూడటం సరికాదని ఆయన అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ప్రకారం, ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని పేర్కొన్నారు. అథారిటీ సూచనలు మాత్రమే చేస్తుందన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక వచ్చే దాకా నిర్ణయాలు తీసుకోకూడదని భావించడం సరికాదన్నారు.

Vinod Kumar
BRS
Telangana
  • Loading...

More Telugu News