Sanjay Manjrekar: రేపు జరగబోయే ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ పై సంజయ్ మంజ్రేకర్ విశ్లేషణ

- ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు భారత్ - పాక్ మధ్య పోరు
- పాక్ జట్టులో సరైన స్పిన్నర్ ఒకరు కూడా లేరన్న మంజ్రేకర్
- రేపటి మ్యాచ్ కు సండే ఫీవర్ రావడం ఖాయమని వ్యాఖ్య
ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ హాట్ ఫేవరెట్లు అంటూ క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఇప్పుడు కప్ గెలిచేది ఇండియానే అని చాలా మంది అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా జరుగుతోంది.
అయితే, బీసీసీఐ ఒత్తిడి మేరకు ఇండియా ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరుగుతున్నాయి. ఇండియా, పాకిస్థాన్ ఫైనల్స్ కు చేరినా... తుది మ్యాచ్ దుబాయ్ లోనే జరుగుతుంది. రేపు దుబాయ్ వేదికగా దాయాదుల పోరు జరగనుంది. ఈ మ్యాచ్ పై టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్థాన్ జట్టులో గతంలో గొప్ప స్పిన్ బౌలర్లు ఉండేవారని... ఇప్పుడు ఒక్క సరైన స్పిన్నర్ కూడా లేడని మంజ్రేకర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. భారత్ కు ఏ స్థాయిలోనూ పాక్ సమీపంలో లేదని చెప్పాడు. గతంతో పోలిస్తే పాక్ జట్టు చాలా బలహీనంగా ఉందని... రేపు జరగబోయే మ్యాచ్ లో మెరవడానికి పాక్ వద్ద ఏమీ లేదని అన్నాడు.
భారత్, పాక్ అభిమానులను అడిగితే దాయాదుల పోరే అత్యుత్తమమని చెబుతారని... కానీ, క్వాలిటీ పరంగా ఈ రెండు జట్ల కంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే పోరు బెటర్ గా ఉంటుందని అన్నాడు. ఏది ఏమైనా భారత్, పాక్ మ్యాచ్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారని... రేపటి మ్యాచ్ కు సండే ఫీవర్ రావడం ఖాయమని చెప్పాడు.
పాక్ జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ గా అబ్రార్ మాత్రమే ఉన్నాడని... దుబాయ్ పిచ్ పై అతడు నెగ్గుకురావడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. పేస్ ప్రభావం కూడా మ్యాచ్ ప్రారంభంలోనే ఉంటుందని... మ్యాచ్ మొత్తం పేస్ ప్రభావం చూపించదని అన్నాడు. టీమిండియానే మెరుగైన స్థితిలో ఉందని చెప్పాడు.