Kumbh Mela 2025: కుంభమేళాలో 60 కోట్ల మంది భక్తుల పవిత్ర స్నానాలు... యోగి సర్కార్ అధికారిక ప్రకటన!

- పుణ్య స్నానమాచరించిన భక్తుల సంఖ్య 60 కోట్లు దాటిందన్న యూపీ సీఎం యోగి
- మహా కుంభమేళా శక్తిని ప్రపంచం మొత్తం కీర్తిస్తోందన్న ముఖ్యమంత్రి
- ఇది ఇష్టంలేని కొందరు అపఖ్యాతి పాల్జేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భాగంగా త్రివేణి సంగమంలో ఇప్పటివరకు పుణ్య స్నానమాచరించిన భక్తుల సంఖ్య 60 కోట్లు దాటినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహాకుంభమేళ శక్తిని ప్రపంచం మొత్తం కీర్తిస్తోందని చెప్పారు. ఇది ఇష్టంలేని కొందరు అపఖ్యాతి పాల్జేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
మహాశివరాత్రి నాటికి 60 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరిస్తారని ముందు అనుకున్నట్లు యోగి తెలిపారు. కానీ దానికి ముందే అంచనాలకు మించి భక్తులు హాజరయ్యారని పేర్కొన్నారు.
కాగా, గత నెల 13న ప్రారంభమైన ఆ ఆధ్యాత్మిక కార్యక్రమం మరో నాలుగు రోజులు మాత్రమే జరగనుంది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళుతున్నారు. ఇక ఆఖరి రోజైన మహాశివరాత్రి (26న) నాడు ఇంకా భారీ మొత్తంలో భక్తులు వస్తారని యూపీ అధికారులు అంచనా వేస్తున్నారు.