Champions Trophy 2025: భారత్-పాక్ మధ్య రేపు హై వోల్టేజ్ మ్యాచ్.. గతంలోని పూర్తి గణాంకాలు ఇవిగో!

- భారత్-పాక్ మధ్య ఇప్పటి వరకు 135 వన్డేలు
- అత్యధిక మ్యాచుల్లో విజయం సాధించిన పాక్
- పాకిస్థాన్‌పై అత్యధిక పరుగుల తేడాతో భారత్ విజయం
- అతి తక్కువ స్కోరు చెత్త రికార్డు భారత్ పేరిటే
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు (23న) భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్‌లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండగా, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ 60 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. సెమీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లు, పరుగులు, వికెట్లు, అత్యధిక స్కోరు, గెలుపోటములు వంటి వివరాల గురించి తెలుసుకుందాం.
- భారత్-పాక్ జట్ల మధ్య ఇప్పటి వరకు 135 వన్డేలు జరిగాయి.
- పాకిస్థాన్ 73 మ్యాచుల్లో విజయం సాధించింది.
- అత్యధిక స్కోరు 356/9: విశాఖపట్నంలో 2005 ఏప్రిల్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఈ స్కోరు సాధించింది. అలాగే, 2023 సెప్టెంబర్ 10న కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది.
- అతి తక్కువ స్కోరు: 1978 అక్టోబర్ 13న సియోల్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 34.2 ఓవర్లలో 79 పరుగులకు ఆలౌట్ అయింది.
- అతిపెద్ద విజయం: 2023 సెప్టెంబర్ 10న పాకిస్థాన్‌పై భారత్ 228 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
- వికెట్ల పరంగా అతి పెద్ద విజయం: 2018 సెప్టెంబర్ 23న దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- అతి తక్కువ పరుగులతో విజయం: 1978 అక్టోబర్ 1న క్వెట్టాలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 4 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
- వికెట్ల పరంగా అతి చిన్న విజయం: 1986లో ఏప్రిల్ 18న షార్జాలో పాకిస్థాన్ జట్టు ఒక్క పరుగు తేడాతో భారత్‌పై విజయం సాధించింది.
- అత్యధిక పరుగులు: సచిన్ టెండూల్కర్ పాక్‌పై 69 మ్యాచుల్లో 2,526 పరుగులు చేశాడు.
- అత్యధిక వ్యక్తిగత స్కోరు: 1997 మే 21న చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో సయీద్ అన్వర్ 146 బంతుల్లో 194 పరుగులు చేశాడు.
- అత్యధిక సగటు (కనీసం 10 ఇన్నింగ్స్‌లలో): ఎంఎస్ ధోనీ 53.52 సగటుతో 36 మ్యాచుల్లో 1,231 పరుగులు సాధించాడు.
- అత్యధిక స్ట్రైక్ రేట్ (కనీసం 500 బంతులు): షాహిద్ అఫ్రిది 67 మ్యాచుల్లో 109.09 సగటుతో 1,524 పరుగులు చేశాడు.
- అత్యధిక సెంచరీలు: సచిన్ టెండూల్కర్, సల్మాన్‌బట్ చెరో ఐదు సెంచరీలు చేశారు.
- అత్యధిక అర్ధ సెంచరీలు: సచిన్ టెండూల్కర్ 16 అర్ధ శతకాలు సాధించాడు.
- అత్యధిక డకౌట్లు: షాహిద్ అఫ్రిది (పాక్), జవగళ్ శ్రీనాథ్ (ఇండియా) చెరో ఆరుసార్లు డకౌట్ అయ్యారు.
- అత్యధిక సిక్సర్లు: షాహిద్ అఫ్రిది 67 మ్యాచుల్లో 51 సిక్సర్లు
- ఒక్క ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు: 1997 అక్టోబర్ 2న లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇజాజ్ అహ్మద్ 9 సిక్సర్లు బాదాడు. ఆ మ్యాచ్‌లో ఇజాజ్ 84 బంతుల్లో 139 పరుగులు చేశాడు. 2005 ఏప్రి్ 15న కాన్పూరులో జరిగిన మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిది 46 బంతుల్లో 102 పరుగులు చేశాడు.
- అత్యధిక వికెట్లు: 48 మ్యాచుల్లో వాసిం అక్రం 60 వికెట్లు తీసుకున్నాడు.
- బెస్ట్ బౌలింగ్: 1991 అక్టోబర్ 25న షార్జాలో జరిగిన మ్యాచ్‌లో అకీబ్ జావెద్ 10 ఓవర్లలో 37 పరుగులిచ్చి 7 వికెట్లు నేలకూల్చాడు.
- అత్యధికసార్లు 5 వికెట్ల ఘనత: అకీబ్ జావెద్ మూడుసార్లు ఈ ఘనత సాధించాడు.
- అత్యధిక మందిని ఔట్ చేసిన ఘనత: మోయిన్ ఖాన్ 71 మంది బ్యాటర్లను పెవిలియన్ పంపాడు. ఇందులో 58 క్యాచ్‌లు, 13 స్టంపింగ్‌లు ఉన్నాయి.
- అత్యధిక క్యాచ్‌లు: మహమ్మద్ అజారుద్దీన్ 64 మ్యాచుల్లో 44 క్యాచ్‌లు అందుకున్నాడు.
- అత్యధిక భాగస్వామ్యం: 2023 సెప్టెంబర్ 10న కొలంబోలో జరిగిన మ్యాచలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కలిసి మూడో వికెట్‌కు అత్యధికంగా 233 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
- అత్యధిక మ్యాచ్‌లు: సచిన్ టెండూల్కర్ 69 మ్యాచ్‌లు ఆడాడు.
- కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు: మహ్మద్ అజారుద్దీన్ 25 మ్యాచ్‌లకు నేతృత్వం వహించాడు.
- కెప్టెన్‌గా అత్యధిక విజయాలు: ఇమ్రాన్‌ఖాన్ 24 మ్యాచుల్లో 19 విజయాలు.
భారత్, పాక్ జట్లు చివరిసారి 2023 అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో తలపడ్డాయి. 192 పరుగుల విజయ లక్ష్యాన్ని రోహిత్ సేన 30.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.