Kash Patel: భగవద్గీతపై ప్రమాణం చేసిన ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్ కాశ్ పటేల్

- ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్‌గా కాశ్ పటేల్ ను నియమించిన ట్రంప్
- వైట్‌హౌస్‌లో అట్టహాసంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవం
- కాశ్ పటేల్‌తో ప్రమాణస్వీకారం చేయించిన అటార్నీ జనరల్ పామ్ బోండీ
- గర్ల్‌ఫ్రెండ్ భగవద్గీతను పట్టుకోగా.. దానిపై చేయి ఉంచి కాశ్ ప్రమాణం
అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్‌గా భారత సంతతి వ్యక్తి కాశ్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా భగవద్గీత సాక్షిగా ఆయన ప్రమాణం చేయడం విశేషం. యూఎస్ అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో అటార్నీ జనరల్ పామ్ బోండీ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాశ్ పటేల్ ప్రేయసి అలెక్సీస్ విల్‌కిన్స్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గర్ల్‌ఫ్రెండ్ భగవద్గీతను పట్టుకోగా.. దానిపై చేయి ఉంచి ఆయన ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం కాశ్ పటేల్ విలేకరులతో మాట్లాడారు.
ఇకపై ఎఫ్‌బీఐ లోపల, వెలుపల జవాబుదారీతనం ఉంటుందన్నారు. మరోవైపు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ ప్రధాన కార్యాలయంలోని వెయ్యి మంది ఉద్యోగులను దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఉన్న ఫీల్డ్ ఆఫీసులకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించారు.
అలాగే మరో 500 మందిని అలబామా, హంట్స్‌విల్లేలోని బ్యూరోకు పంపించనున్నట్లు తెలిపారు. కాగా, కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన పాలకవర్గంలో భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్న సంగతి తెలిసిందే.